కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు క్రీ.శ 1896వ సంవత్సరములో కలకత్తా నగరంలో జన్మించారు. ఆయన తమ గురుదేవులైన శ్రీ శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరులను క్రీ.శ 1922వ సంవత్సరములో కలకత్తాలో కలిసికొన్నారు. సుప్రసిద్ధ ధర్మప్రబోధకులు, అరవైనాలుగు గౌడీయమఠాలకు సంస్థాపకాచార్యులు అయిన భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరులు ఆ విద్యావంతుడైన యువకుని పట్ల ప్రీతి చెందినవారై వేదజ్ఞాన ప్రబోధానికై జీవితాన్ని అంకితము చేయడానికి అతనిని ఒప్పించారు. శ్రీల ప్రభుపాదులు ఆయనకు శిష్యునిగానై క్రీ.శ 1933వ సంవత్సరములో యథావిధిగా మంత్రదీక్ష స్వీకరించారు.
క్రీ.శ 1922లో తొలి సమాగమములోనే శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరులు వేదజ్ఞానాన్ని ఆంగ్లభాషలో ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదులను అడిగారు. తదనంతర సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదులు భగవద్గీతకు వ్యాఖ్యానము వ్రాసారు, గౌడీయమఠ కార్యాలలో సహాయపడ్డారు, క్రీ.శ 1944లో ”బ్యాక్ టు గాడ్‌హెడ్” అనే ఆంగ్ల పక్ష పత్రికను ఆరంభించారు. శ్రీల ప్రభుపాదులే ఒంటరిగా దానిని రచించడము, టైపు చేయడము, ప్రూఫులు దిద్దడము, చివరకు వాటిని పంచడము కూడ చేసేవారు. ఆ పత్రిక ఇపుడు ఆయన శిష్యప్రశిష్యులచే ప్రపంచమంతట కొనసాగించబడుతున్నది.
క్రీ.శ. 1950లో శ్రీల ప్రభుపాదులు అధ్యయనానికి, రచనా వ్యాసంగానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. అపుడు ఆయన బృందావనానికి వెళ్ళి అక్కడ చారిత్రిక రాధాదామోదర మందిరములో అతిసరళమైన పరిస్థితులలో నివసించారు. అక్కడే ఆయన గహనమైన అధ్యయనములో, రచనా వ్యాసంగములో అనేక సంవత్సరాలు గడిపారు. ఆయన క్రీ.శ. 1959లో సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించారు. శ్రీరాధాదామోదర మందిరములోనే శ్రీల ప్రభుపాదులు పదునెనిమిదివేల శ్లోకయుతమైన శ్రీమద్భాగవతానికి (భాగవత పురాణము) బహుసంపుటాల వ్యాఖ్యానాన్ని వ్రాయడం మొదలుపెట్టారు. ఆయన ”గ్రహాంతర సులభయానము” అనే పుస్తకాన్ని కూడ వ్రాసారు.
భాగవతములోని మూడు సంపుటాలను ముద్రించిన తరువాత శ్రీల ప్రభుపాదులు తమ గురుదేవుని కార్యాన్ని నెరవేర్చడానికి సెప్టెంబరు 1965లో అమెరికా దేశానికి వెళ్ళారు. తదనంతరము ఆయన భారతదేశపు తాత్త్విక ధార్మిక గ్రంథాలకు ప్రామాణికమైన యాభైకి పైగా వ్యాఖ్యానాలను, గ్రంథాలను వ్రాసారు.
న్యూయార్క్ నగరానికి మొట్టమొదటిసారి సరకుల రవాణా నౌకలో వెళ్ళినపుడు శ్రీల ప్రభుపాదుల దగ్గర ఏమాత్రము డబ్బు లేదు. దాదాపు ఒక సంవత్సరకాలము తరువాత ఆయన అతికష్టము మీద జూలై 1966లో అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘాన్ని ఆరంభించారు. నవంబరు 14, 1977లో ఆయన తనువును చాలించే వేళకు ఆ సంఘము నూరుకు పైగా మందిరాలు, విద్యాలయాలు, ఆశ్రమాలు, వ్యవసాయ క్షేత్రాలతో ప్రపంచవ్యాప్త సంఘముగా రూపొందింది.
క్రీ.శ 1972లో శ్రీల ప్రభుపాదులు డల్లాస్ (టెక్సాస్)లో గురుకుల పాఠశాలను ఆరంభించి పశ్చిమదేశాలలో వైదిక విద్యకు శుభారంభము చేసారు. ఆ తరువాత ఆయన శిష్యులు అటువంటి గురుకులాలను అమెరికాలోను, ప్రపంచములోని ఇతర భాగాలలోను నెలకొల్పారు.
శ్రీల ప్రభుపాదులు భారతదేశంలో భవ్యమైన మందిర నిర్మాణాలను చేపట్టారు. శ్రీధామ మాయాపూర్‌లో ఒక ఆధ్యాత్మికనగర నిర్మాణానికి ఆయన రూపకల్పన చేసారు. బృందావనములో అద్భుతమైన కృష్ణబలరామ మందిరము, అంతర్జాతీయ వసతి గృహము, గురుకుల పాఠశాల, శ్రీల ప్రభుపాదుల వస్తుప్రదర్శనశాల వంటివి ఏర్పాటు చేయబడినాయి. బొంబాయి నగరములో కూడ భవ్యమైన విద్యాసాంస్కృతిక కేంద్రము ఏర్పాటు జరిగింది. అదేవిధంగా భారతదేశంలోని అన్ని ముఖ్యనగరాలలో మందిర నిర్మాణాలు జరిగాయి.
గ్రంథాలే శ్రీల ప్రభుపాదులు ఒసగినట్టి అత్యంత ప్రధానమైన వరము. ఆ గ్రంథాల ప్రామాణికతను, లోతును, స్పష్టతను ఎందరో పండితులు శ్లాఘించారు. అవి అనేక కళాశాలలలో పాఠ్యాంశముగా కూడ ఏర్పాటు చేయబడినాయి. ఆయన రచనలు ఇపుడు యాభైకి పైగా భాషలలోకి అనువదించబడినాయి. ఆయన గ్రంథాలను ముద్రించడానికి క్రీ.శ 1972లో ఏర్పాటు చేయబడిన భక్తివేదాంత బుక్ ట్రస్ట్ భారతీయ ధార్మిక తాత్త్విక గ్రంథాలను ముద్రించడములో ప్రపంచములోనే అత్యంత పెద్ద సంస్థగా రూపొందింది.
క్రీ.శ. 1965లో అమెరికాకు వెళ్ళినప్పటి నుండి క్రీ.శ 1977లో బృందావనమునందు నిత్యలీలాప్రవిష్ఠులు అయ్యే లోపల, అంటే కేవలం పన్నెండేళ్ళలో శ్రీల ప్రభుపాదులు భూగోళాన్ని పదునాలుగుసార్లు చుట్టి ఆధ్యాత్మికోపన్యాసాలు చేసారు. ఆ విధంగా ఆయన ఆరు ఖండాలలో పర్యటించారు. అయినప్పటికిని ఆయన రచనా వ్యాసంగాన్ని పరమోత్సాహంతో కొనసాగించారు. ఆయన రచనలు వైదిక తత్త్వము, ధర్మము, సాహిత్యము, సాంస్కృతిక రంగాలలో నిజమైన గ్రంథాలయమునే ఏర్పాటు చేసాయి.