Bhadavad Darshan | Bhagavad Darshan History

Bhagavad Darshan History

భగవద్దర్శన్‌ చరిత్ర

అది డిసెంబర్‌, 1936. ఆ సమయంలో శ్రీ శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరులు (శ్రీల ప్రభుపాదులవారి గురుదేవులు) జగన్నాథపురి క్షేత్రంలో ఉన్నారు. ఆయనకు ఒంట్లో బాగాలేదు. అభయ్‌ చరణదాస్‌ (శ్రీల ప్రభుపాదులు) అపుడు బొంబాయిలో ఉన్నారు. ఆయన తమ గురువుగారికి ఒక ఉత్తరము వ్రాద్దామని అనుకున్నారు. “ఆయనకు నా పట్ల కొద్దిగా దయ ఉంది, నా వినతిని ఆయన అర్థం చేసికొంటారు” అని అభయచరణదాస్‌ మనస్సులో భావించి ఉత్తరం వ్రాయడం మొదలుపెట్టారు.
“ప్రియమైన గురుమహారాజుగారికి,
మీ పాదపద్మాలకు నా వినమ్రమైన నమస్సులు. మీకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు, నేను వారిలో ఒకడిని. కాని వారందరు మీకు ప్రత్యక్షంగా సేవ చేస్తున్నారు. వారిలో కొందరు బ్రహ్మచారులు, కొందరు సన్న్యాసులు; కాని నేను మాత్రము ఒక గృహస్థుడిని. నేను ఆ విధంగా సేవ చేయలేను. అప్పుడప్పుడు ఏదో కొంత ధనసహాయం మాత్రమే చేయగలుగుతున్నాను, కాని మీకు ప్రత్యక్షసేవ చేయలేకపోతున్నాను. నేను చేయగలిగే ప్రత్యేకమైన సేవ ఏదైనా ఉందా?”

అభయచరణ్‌ వ్రాసిన భావపూర్ణమైన, సేవాభిలాషిత ఉత్తరానికి రెండు వారాలలో సమాధానం వచ్చింది. “ఇతర భాషలతో పరిచయము లేనివారికి మన భావాలను, వాదాన్ని నీవు ఇంగ్లీషు భాషలో వివరించగలవని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇది నీకు, నీ శ్రోతలకు చాలా లాభాన్ని చేకూరుస్తుంది. శ్రీచైతన్యమహాప్రభువు ఉపదేశాలను గురించి జనసామాన్యములోను, తత్త్వవేత్తలు మరియు ధార్మికులలోను ఒక నూతనమైన అభిప్రాయాన్ని కలగజేయడమనే కార్యంలో నీవు ఆంగ్లంలో ప్రచారం చేసే ఒక మంచి ప్రచారకునిగా అవుతావని నా ఆశ.”

గురుమహారాజు నుండి ఈ సమాధానం ప్రత్యుత్తర రూపంలో రాగానే అభయచరణ్‌కు 1922 నాటి తొలిసమాగమం గుర్తుకు వచ్చింది. అపుడు ఇచ్చిన ఉపదేశాన్నే తిరిగి గురుదేవుడు ఇప్పుడు కూడ ఇచ్చారు. ఇక తన జీవితలక్ష్యం, ప్రయోజనం గురించి వేరే ఎటువంటి సందేహాలు లేవని అభయ్‌కి అపుడు అనిపించింది. ఆనాడు కలకత్తాలో తొలిసారిగా కలిసినపుడు ఇచ్చిన సందేశానికి, ఈనాటి సందేశానికి ఏమాత్రము తేడా లేదు. కాబట్టి ఆనాటి సమాగమము, సందేశము ఏదో కాకతాళీయంగా జరిగినవి కానేకావు. అంతా ముందే నిర్ణయించబడింది.

శిష్యునికి ఆ సందేశం అందిన కొన్ని రోజులకే శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరులు నిత్యలీలాప్రవిష్ఠులయ్యారు. అభయచరణ్‌కు గురుదేవుల అంతిమ సందేశం హృదయంలో నిలిచిపోయింది. అదే ప్రతీక్షణం ప్రతిధ్వనించసాగింది.

కాలం దొర్లిపోయింది. సెప్టెంబరు 1939లో రెండవ ప్రపంచయుద్ధం ప్రకటించబడింది. ఆంగ్లేయుల పాలనలో ఉన్నట్టి భారతదేశం జర్మనీతో యుద్ధానికి దిగిందని బ్రిటిష్‌ అధికారులు ప్రకటించారు. యుద్ధం చాలా సంవత్సరాలు కొనసాగింది. ఆ యుద్ధనీతిలో భాగంగా 1943లో బ్రిటిష్‌వారు కృత్రిమ, మానవకల్పితమైన క్షామాన్ని సృష్టించారు. తత్ఫలితంగా భారతీయులందరికీ ఆహారకొరత ఏర్పడింది. అపుడు బెంగాల్‌లో గత 150 ఏళ్ళలో ఏనాడు కనివినీ ఎరుగనంతగా ఆహారకొరత కలిగింది. అభయచరణ్‌ ఎంతో కష్టపడి తన కుటుంబానికి కావలసిన ఆహారపదార్థాలు ఏర్పాటు చేయగలిగారు. ఆ క్షామాన్ని చూసిన అభయ్‌కు కృష్ణభక్తిభావన అవసరము ఎప్పటికంటే ఇప్పుడే ఎక్కువ అవసరముగా ఉన్నట్లు కనిపించింది. ఆ సమయంలో ప్రతీరోజు బాంబులు పడేవి. ముఖ్యంగా ఆ బాంబుల దాడి కొన్ని ప్రత్యేకమైన స్థానాలలోనే జరిగేది.

యుద్ధపీడిత ప్రపంచమానవాళికి అభయచరణ్‌ కొంత సందేశం ఇవ్వాలని భావించారు. దాని కొరకు ఆయన ఎంతో కాలంగా ఆలోచిస్తూనే ఉన్నారు; ప్రభావశీలమైన పద్ధతి ద్వారా అది చేయాలని ఆయన సంకల్పం. ఆ పద్ధతి కేవలం పత్రికను ప్రచురించడమే. రచన చేయడానికి ఆలోచనలకు అసలు కొదవే లేదు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బును తాను ప్రచురణ నిమిత్తం పొదుపు చేసే ఉన్నారు. అయినా పత్రికను ప్రచురించేటంత శక్తి తనకు ఉన్నదా? శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరుల పండిత, సన్న్యాసశిష్యులే పత్రిక ప్రచురణకు సాహసించనపుడు తాను ఏ విధంగా ఆ సాహసం చేయగలరు? తనకు శిష్యులందరిలోను ‘కవి’ అనే పేరు ఉంది, అందరు తనను మంచి పండితునిగా ఒప్పుకున్నారు. ఇపుడు “భక్తివేదాంత” బిరుదు కూడ వైష్ణవులు ఇచ్చారు. కాని ఒక గృహస్థునికి పత్రికను ప్రారంభించేటంత తెగువ చేయడం సమంజసమేనా?

1936 నుండి ఇప్పటిదాకా తాను ఆలోచిస్తూనే ఉన్నారు. ఎటువంటి ఆర్థికస్తోమత, సహకారము లేకపోయినప్పటికిని పత్రికను ప్రచురించేటంత సాహసం చేయడం పట్ల ఆయన నిరంతరము ఆలోచించారు. అయితే ఎవ్వరూ తనను ఆ కార్యంలో నిరుత్సాహపరచలేదు, అందుకే ఆయన ఆ అద్భుతమైన కార్యాన్ని చేయడానికి ధైర్యం చేసారు.

ఆధ్యాత్మికపత్రికను ప్రచురించి సందేశాన్ని ప్రచారం చేయడం తన గురుపరంపర కార్యాలలో ముఖ్యమైనదని అభయ్‌కు బాగా తెలుసు. హార్మోనిష్టు, నదియాప్రకాశ వంటి పత్రికలను తన గురుదేవుడు ప్రచురించారు. కాని ఇపుడు ఆ ప్రచురణ ఆగిపోయింది.

1944లో అభయచరణ్‌ దాసు గతంలో వచ్చిన గుర్వాదేశాన్ని ఆచరణలో పెడుతూ భగవద్దర్శన్‌ పత్రికకు శుభారంభం చేసారు. తన ఇంట్లోని ముందు గదినే తన ఆఫీసుగా మలచుకొని వ్యాసాలు వ్రాసి, ఎడిటింగ్‌ చేసి, టైపు చేసి పత్రికకు కావలసిన అన్ని వ్యాసాలను పూర్తి చేసారు. పత్రికకు చేసిన నామకరణం “బ్యాక్‌ టు గాడ్‌హెడ్”. పత్రికకు మొదటి పేజీలోని పై భాగంలో “బ్యాక్‌ టు గాడ్‌హెడ్” చిత్రకల్పన చేసి, దాని క్రింద చిన్న సందేశం ఇచ్చారు. “కృష్ణుడు సూర్యుని వంటివాడు, మాయ అంధకారము వంటిది. కృష్ణుడు ఉన్నచోట మాయ నిలువలేదు”. దాని కొరకు వేసిన చిత్రంలో శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరుల బొమ్మ కూడ ఉంది. ఆ మొదటి పేజీలోనే ఎవరి నిర్దేశంలో ఆ పత్రిక ప్రచురించబడుతున్నదో, ఎవరు దానిని ప్రారంభించారో స్పష్టంగా వ్రాయడం జరిగింది.

సంపాదకులు, వ్యవస్థాపకులు శ్రీయుత అభయచరణ్‌ డే (శ్రీ శ్రీమద్‌ భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వామి ప్రభుపాదుల ప్రత్యక్ష నిర్దేశములో)
అభయ్‌కి ముద్రణ విషయంలో కొంత పరిచయము ఉన్నది. అదంతా తమ వ్యాపార సంబంధములోనే జరిగింది. వ్యాసాలన్నింటినీ వ్రాసి, టైపు చేసిన తరువాత బెంగాల్‌లో ఎంతో పేరు పొందిన సరస్వతీ ప్రింటర్స్‌ను అభయ్‌ కలిసారు. ఆ పత్రికను అన్నిచోట్ల అమ్మడానికి థాక్కర్, స్పింట్‌ ఎండ్‌ కంపెనీని అభయ్‌ సంప్రదించారు. ఆ తరువాత పత్రికను ముద్రించడానికి కావలసిన పేపరు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసారు. ఆ సమయంలో యుద్ధవాతావరణం నెలకొని ఉన్నది కాబట్టి పేపరు దొరకడం కష్టమైంది. “బ్యాక్‌ టు గాడ్‌హెడ్” పత్రిక ముద్రించడానికి అవసరమైన పేపరు కోసం చేసిన దరఖాస్తును అధికారులు త్రోసిపుచ్చారు. అయినా అభయ్‌ చలించలేదు. తీవ్రంగా ప్రయత్నాలు చేసారు. భగవత్సందేశాన్ని ముద్రించడం కొరకు పేపరును వాడడం వృథా కాదని, ప్రస్తుత కల్లోల పరిస్థితులలో అదే అత్యంత అవసరమని అభయ్‌ తీవ్రంగా వాదించారు. మొత్తానికి బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌ నలభై పేజీల తొలిసంచికను ముద్రించి, విడుదల చేయడానికి అనుమతి లభించింది.

మొదటి సంచికలో అభయచరణ్‌ అనేకమైన భావగర్భిత వ్యాసాలను ప్రచురించారు. యుద్ధపరిణామాలను వివరించే వ్యాసం అందులో ఉన్నది. ఆ సంచికలో అభయ్‌ దైవీసోదరులు కూడ కొన్ని వ్యాసాలు వ్రాసారు. భక్తిసారంగగోస్వామి కూడ వ్యాసం వ్రాసారు. ఆ సంచిక వెనుక పేజీలో తన రాబోయే రచనల గురించి అభయ్‌ తెలుపుతూ ప్రకటన చేసారు. అభయచరణ్‌ ఆ తొలి సంచికను తన గురుదేవుని ఆవిర్భావదినం నాడే విడుదల చేసారు. వ్యాసపూజ సందర్భంగా తాను గురుదేవునికి సమర్పించే అంజలి అదేనని అభయ్‌ అనుకున్నారు. అదే విషయాన్ని అభయ్‌ ఆ సంచిక ముందు పేజీలలోనే ప్రచురించారు. ఈ విధంగా “బ్యాక్‌ టు గాడ్‌హెడ్” 1944 సంవత్సరం శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరుల వ్యాసపూజ సందర్భంగా ఆవిర్భవించడం జరిగింది. అందుకే ఈ 2014 సంవత్సరానికి దీనికి 70 ఏళ్ళు నిండాయి. ఇంకో ఐదేళ్ళలో వజ్రోత్సవ సమయం (75 ఏళ్ళు) కూడ వచ్చేస్తుంది.

తొలిసంచిక తరువాత పరిస్థితులు
తొలిసంచిక తరువాత రెండవ సంచికను ముద్రించడానికి కూడ అభయచరణ్‌కు పేపరు కొరత అడ్డంకిగా నిలిచింది. అయినా అభయచరణ్‌ తీవ్రమైన పట్టుదలతో ప్రయత్నం చేసారు. పేపరును పొందడానికి అధికారులకు ఎన్నో ఉత్తరాలు వ్రాసారు. మొత్తానికి ప్రయత్నం ఫలించి రెండవ సంచికకు పేపరు లభించింది. అందుకే ఆయన ఆ సంచికలో “భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అనే వ్యాసం కూడ ప్రచురించడం జరిగింది.

అయినా రెండు సంచికలు ముద్రించగానే “బ్యాక్‌టు గాడ్‌హెడ్” ముద్రణ ఆగిపోవలసి వచ్చింది. నిధుల కొరతే దానికి కారణం.

తరువాత అభయచరణ్‌ లక్నోలో వ్యాపారాన్ని మానివేసి అలహాబాదులో వ్యాపారం మొదలుపెట్టారు. తరువాత క్రొత్త వ్యాపారంలో సంపాదించి, పొదుపు చేసిన డబ్బుతో ఆయన తిరిగి 1952లో బ్యాక్‌టు గాడ్‌హెడ్‌ను ముద్రించడం మొదలుపెట్టారు. కాని అది మళ్ళీ ఆగిపోయింది. కాని 1956వ సంవత్సరములో మళ్ళీ అభయ్‌ దానిని ప్రారంభించే యత్నాలు చేసారు. ఇపుడు తాను దాదాపు వానప్రస్థిగా జీవించడం మొదలుపెట్టారు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు తాను ప్రచురించిన పత్రికకు ఒక్కొకప్పుడు ఆయన డబ్బు కూడ తీసికోలేదు. కాని ఇపుడు మాత్రము అభయచరణ్‌ స్వయంగా తానే వెళ్ళి అమ్మే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. టీ దుకాణాలకు కూడ వెళ్ళి వారికి పంచే ప్రయత్నాలు జరిగాయి. ఆ సందర్భంగా జనులతో జరిగే సంభాషణలు బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌లో వ్యాసాలకు స్ఫూర్తిగా అవసాగాయి. తరువాత అభయచరణ్‌ బృందావనవాసిగా అయి, అక్కడ నుండే “బ్యాక్‌ టు గాడ్‌హెడ్”ను ముద్రించి పంచే ప్రయత్నాలు చేసారు. కొంతకాలానికి అభయచరణ్‌ సన్న్యాసాశ్రమములో ప్రవేశించి భక్తివేదాంతస్వామిగా అయ్యారు. సన్న్యాసాశ్రమములో కూడ భక్తివేదాంతస్వామి బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌ పత్రిక రచన వితరణలను ఎంతో కష్టపడి కొనసాగించారు.

తరువాత కొంతకాలానికి ఒక లైబ్రేరియన్‌ భక్తివేదాంతస్వామితో మాట్లాడుతూ పత్రికను వ్రాసే బదులు గ్రంథాలు వ్రాస్తే బాగుంటుందని, అవి శాశ్వతంగా ఉంటాయని అనడం జరిగింది. తన గురుదేవుడే ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నారని భక్తివేదాంతస్వామి భావించారు. తరువాత బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌ పత్రిక అభిమానియైన ఒక సైనికాధికారి కూడ అదే సలహాను ఇచ్చాడు. అది కూడ తన గురుదేవుని సందేశమని భక్తివేదాంతస్వామి భావించి శాశ్వతమైన రచన చేయడానికి సంకల్పం చేసారు. అదే అద్భుతమైన శ్రీమద్భాగవత వ్యాఖ్యాన శుభారంభానికి దారి తీసింది.

ఈ విధంగా శ్రీ శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరుల ఆదేశంతో శ్రీల ప్రభుపాదులవారి ఆంగ్ల భాషలో ప్రచారం “బ్యాక్‌ టు గాడ్‌హెడ్” (భగవద్దర్శన్‌) ద్వారా ప్రారంభమై దివ్యమైన శ్రీమద్భాగవత వ్యాఖ్యానరూపంగా మారింది. తరువాత శ్రీల ప్రభుపాదులు అమెరికాలో అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘాన్ని స్థాపించిన తరువాత ఆయన శిష్యులు తిరిగి బ్యాక్‌ టు గాడ్‌ హెడ్‌ పత్రికను పునఃస్థాపించి సర్వత్ర లక్షల సంఖ్యలో పంచడం మొదలుపెట్టారు. ఆ పత్రిక వితరణలో వారు ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించారు. అదే పత్రిక ఇపుడు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన భాషలలో ప్రచురించబడుతున్నది. అదే మన తెలుగుభాషలో “భగవద్దర్శన్” పేరు మీద లభిస్తోంది. డెభై ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆధ్యాత్మిక పత్రిక లక్షలాది జనులలో ఇన్నేళ్ళుగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతోంది.

Recent Magazines