1956లో శ్రీల ప్రభుపాదులు తాము ముద్రించిన కొన్ని “బ్యాక్ టు గాడ్‌హెడ్” ప్రతులను, వాటితో పాటు ఒక ప్రత్యేకమైన ఉత్తరాన్ని డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కు వ్రాసారు.
“ప్రస్తుత భౌతికదేహాన్ని త్యజించిన తరువాత భగవద్ధామానికి వెళ్ళగలిగే ఉపాయం నా దగ్గర ఉన్నది. ప్రపంచములోని సమకాలీన పురుషులను, స్త్రీలను అందరినీ నాతోపాటు తీసికొని పోవడానికే నేను ఈ “బ్యాక్‌టు గాడ్‌హెడ్” పత్రికను ప్రారంభించాను. ఆ దారిలో వెళ్ళడానికి దీనినొక సాధనంగా నేను చేసికొన్నాను. ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టిన తరువాత నేను భగవద్ధామానికి తప్పకుండ వెళతానని అన్నందుకు నన్ను ఏదో అద్భుతమైన వ్యక్తిననో లేదా పిచ్చివాడననో అనుకోకండి! అది ప్రతియొక్కరికి, మనందరికీ సాధ్యమే!”
తాను పంపించిన ‘బ్యాక్ టు గాడ్‌హెడ్’ పత్రికలలోని శీర్షికల పేర్లనైనా పరిశీలించమని శ్రీల ప్రభుపాదులు రాష్ట్రపతిని అర్థించారు. అసురుల పాలన వచ్చే అవకాశం ఉన్నదని, అందుకే సంఘమును పతనం చెందకుండా కాపాడవలసిందని ఆయన రాష్ట్రపతిని పదేపదే అడిగారు. తాను పంపించిన పత్రికలను చూసిన తరువాత తనకు ఆయనతో (రాష్ట్రపతి) సమావేశమయ్యే అవకాశాన్ని ఇవ్వమని అర్థించారు. “నేనిప్పుడు ఒంటరిగా అరణ్యరోదనం చేస్తున్నాను” అని శ్రీల ప్రభుపాదులు ఆ ఉత్తరంలో వ్రాసారు. కాని ఆ ఉత్తరానికి భారతరాష్ట్రపతి నుండి సమాధానం రాలేదు.
శ్రీల ప్రభుపాదులు భారతరాష్ట్రపతికి వ్రాసిన ఆ ఉత్తరము ద్వారా భగవద్దర్శన్ పత్రిక ప్రయోజనము సుస్పష్టంగా తెలుస్తున్నది.